నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్‌లోకి వరద నీరు సహాయక చర్యలను పర్యవేక్షించిన మాణిక్ యాదవ్
పటాన్‌చెరు, జూన్ 23 (ప్రజావాణి):
బీరంగూడ డివిజన్ పరిధిలోని నవ్య ప్రైడ్ అపార్ట్మెంట్ సెల్లార్‌లో భారీగా వర్షపు నీరు చేరి వాహనాలు మునిగిపోయిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా అపార్ట్మెంట్ సెల్లార్ పూర్తిగా జలమయం కాగా, అక్కడ పార్క్ చేసిన 20కి పైగా ద్విచక్ర వాహనాలు, పలువురు నివాసితుల కార్లు నీటిలో మునిగిపోయాయి.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెబుతూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడిన మాణిక్ యాదవ్, సెల్లార్‌లో నిల్వ ఉన్న నీటిని వేగంగా తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేసిన ఆయన, భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అవసరం లేకపోతే సెల్లార్ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లు, నీటిలో మునిగిన ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
పిల్లలను నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆడనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్, కాలువలు, నీటితో నిండిన రహదారుల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని మాణిక్ యాదవ్ పేర్కొన్నారు.




