*తల్లికి పదవి.. కొడుకు పెత్తానమా?*
*గుండెంగా గ్రామ పంచాయతీలో అధికార దుర్వినియోగం ఆరోపణలు?*
*సర్పంచ్ సంతకాలు ఫోర్జరీ చేసి చెక్కులు, తీర్మానాలపై సంతకాలు చేశాడని ఆరోపణలు?*
*కలెక్టర్‌కు గ్రామస్తుల ఫిర్యాదు – సర్పంచ్‌పై చర్యలు, పదవి రద్దు చేయాలని డిమాండ్*
గూడూరు మండల ప్రతినిధి:- ఆగస్టు 05. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రం పరిధిలోని గుండెంగా గ్రామ పంచాయతీలో అధికార దుర్వినియోగం జరిగిందంటూ..? గ్రామస్తులు, వార్డు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ బోడ రాజి కుమారుడు, మాజీ ఎంపీటీసీ బోడ కిషన్ అధికారిక హోదా లేకపోయినా గ్రామ పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. సర్పంచ్ అధికారాలను వినియోగిస్తున్నాడని ఆరోపించారు. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమాచారం ఇవ్వకుండా పంచాయతీ రికార్డులు, రిజిస్టర్లు తమ ఇంటికి తీసుకెళ్లడంతో పాటు, గ్రామ పంచాయతీ చెక్కులు, తీర్మానాలపై సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సంతకాలు చేస్తున్న సమయంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు అడ్డుకొని నిలదీశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది?. ఈ సంఘటనకు నిరసనగా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. “తల్లికి పదవి… కొడుకు పెత్తనమా?”, “ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ పాలన జరగాలే గానీ కుటుంబ పాలన కాదు” అంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ అధికారాలను అనధికారికంగా వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తేజావత్ రాంసింగ్ తండా గ్రామపంచాయతీ పర్యటనకు వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ వాహనాన్ని గుండెంగా గ్రామపంచాయతీ వద్ద గ్రామస్తులు ఆపి వినతిపత్రం సమర్పించారు. జరిగిన ఘటనను కలెక్టర్‌కు వివరించి, సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పదవిని రద్దు చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్పందిస్తూ, ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని (డీపీఓ) ఆదేశించినట్లు సమాచారం. విచారణలో వాస్తవాలు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, చెక్కుల వినియోగం, తీర్మానాలపై సంతకాల వ్యవహారంలో పారదర్శక విచారణ జరిపి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన గూడూరు మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.




