పదిహేను రోజుల క్రితం తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ ను తల్లి ఒడికి చేర్చిన జవహర్ నగర్ పోలీసులు.
జవహర్ నగర్, ఆగస్టు 8 (ప్రజావాణి ప్రతినిధి)
గత నెల 26వ తేదీ ఆదివారం రోజు అంబేద్కర్ నగర్ లోని తన నివాసం నుండి బయటికి వెళ్లిన అఖిల్ కనబడకుండా పోవడంతో తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై పలు వార్తా పత్రికలు, చానల్లలో వచ్చిన కథనానికి స్పందించిన జవహర్ నగర్ ఠాణా సీఐ సైదులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. తన పేరును గాని, అడ్రస్ గానీ, కనీసం తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ గాని తెలపలేని దీన స్థితిలో ఉన్న 24 ఏళ్ల అఖిల్ ను పట్టుకోవడాన్ని పోలీసులు ఛాలెంజ్ గా తీసున్నారు. మొదటగా పోలీసులు అంబేద్కర్ నగర్ నుండి బోయిన్పల్లి వరకు ఉన్న సుమారు 100 కు పైచిలుకు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి అక్కడి ప్రాంతంలోనే తిరుగుతున్నట్టుగా నిర్ధారించుకున్నారు.
పోలీసులు ఒకవైపు ముమ్మరంగా వెతుకుతూనే ఎంతో చాకచక్యంగా మున్సిపల్ సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంతో ఈరోజు ఉదయం బాలానగర్ లోని మున్సిపల్ సిబ్బంది ఒకరు అర్థనగ్నంగా తిరుగుతున్న అఖిల్ సమాచారాన్ని జవహర్ నగర్ పోలీసులకు అందించారు.
వెంటనే స్పందించిన సిఐ సైదులు ఒక ప్రత్యేక బృందాన్ని బాలానగర్ కు పంపించారు. అక్కడికి వెళ్ళిన పోలీసులు అర్థనగ్నంగా ఉన్న అఖిల్ కు బట్టలు తొడిగి కారులో ఠాణాకు తీసుకువచ్చి అతని తల్లితండ్రులకు అప్పజెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారు తప్పిపోయిన తమ బాబు దొరకడానికి సహకరించిన పోలీసు ఉన్నతాధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
తప్పిపోయిన దివ్యాంగుడు అఖిల్ ను తల్లి ఒడికి చేర్చిన జవహర్ నగర్ పోలీసులు
RELATED ARTICLES




