*కోదాడ రూరల్ నూతన ఎస్సైగా షేక్ యాకూబ్*
కోదాడ, జూలై 09, ప్రజావాణి
కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా షేక్ యాకూబ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులునిర్వహించిన గోపాల్ రెడ్డి నేరేడుచర్లకు బదిలీ కావడంతో, జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్బీ విభాగంలో పనిచేస్తున్న షేక్ యాకూబ్ ను కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ షేక్ యాకూబ్ మాట్లాడుతూ,
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పోలీసు సేవలను మరింత
సమర్థవంతంగా అందిస్తామని తెలిపారు. కోదాడ రూరల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారించి చట్ట ప్రకారం చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. అలాగే యువత మాదకద్రవ్యాలు, ఇతర
సామాజికదురాచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో
శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రజల సహకారం ఎంతో అవసరమని, పోలీసు ప్రజల సమన్వయంతో నేరాల నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తానని ఎస్ఐ షేక్ యాకూబ్ తెలిపారు. అనంతరం సిబ్బంది స్వాగతం పలికారు.నూతన ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన షేక్ యాకూబ్ ను జర్నలిస్ట్ పులి నాగరాజు బృందం పూల బోకే తో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.





