విజేతగా ‘ప్రదీప్-11’ జట్టు
ముఖ్య అతిథిగా ఎస్సై పి ఉదయ్ కుమార్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 28 (ప్రజావాణి):
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న “కొత్తపేట ప్రీమియర్ లీగ్ (కేపిల్) సీజన్-1” క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఘనంగా ముగిసింది. గ్రామ సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఫైనల్లో ‘ప్రదీప్-11’, ‘రాము-11’ జట్లు తలపడగా, అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రదీప్-11 జట్టు విజయాన్ని కైవసం చేసుకుని ప్రథమ బహుమతిని గెలుచుకుంది. రాము-11 జట్టు రన్నరప్‌గా నిలిచి ద్వితీయ బహుమతిని అందుకుంది. ఈ ముగింపు వేడుకలకు ఉమ్మడి వెల్గటూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ఉదయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువత క్రీడల్లో, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి పెద్ద కొడుకులా బాధ్యతగా ఉంటూ, ఎలాంటి చెడు వ్యసనాలకు లోనవ్వకుండా జాగ్రత్త పడాలని, యువత అంతా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి తోడ్పడి సమాజంలో ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు గ్రామ సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ… క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటుతూ యువత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


