*అక్రమ వెంచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి*
* *మన ప్రజావాణి*, *మందమర్రి రూరల్*:- మే 27
మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయితీ లేమూరు శివారులో గల అక్రమ వెంచర్ల పై సమగ్ర విచారణ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బచ్చలి ప్రవీణ్ కుమార్ బుధవారం ప్రకటనలో డిమాండ్ చేశారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని లేమూరు శివారులో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ, కొంతమంది వ్యక్తులు అక్రమ వెంచర్ల పేరుతో వ్యవసాయ భూములను ప్లాటింగ్ చేసి, విక్రయాలకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులు, సంబంధిత శాఖల లేఅవుట్ ఆమోదాలు, గ్రామ పంచాయితీ నిబంధనలు పాటించకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి, విక్రయాలు నిర్వహించేందుకు ప్రయత్నించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడటమే కాకుండా అమాయక ప్రజలను మోసం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాటింగ్ నిర్వహిస్తూ, ప్రజలను ఆకర్షించే విధంగా ప్రచారం చేసి, లక్షల రూపాయల ఆస్తుల విక్రయాలకు సిద్ధమవుతున్నారని, దీనివల్ల భవిష్యత్తులో కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు వెంటనే స్పందించి, వెంకటాపూర్ గ్రామ పంచాయితీ లేమూరు శివారులో జరుగుతున్న అక్రమ వెంచర్లపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు సైతం సరైన ప్రభుత్వ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, రిజిస్ట్రేషన్ సంబంధిత పత్రాలు పరిశీలించిన తర్వాత మాత్రమే ప్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రజలను మోసపూరిత వ్యాపారాల నుంచి రక్షించేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.





