ఘట్‌కేసర్, జూలై 25: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం వార్డులో యన్నంపేట్–నారాపల్లి ప్రాంతాల్లో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న భవన యజమానులపై టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసి నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆదేశించినప్పటికీ, కొందరు యజమానులు సెలవు దినాల్లో అక్రమంగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో గతంలో పలుమార్లు కూల్చివేతలు నిర్వహించినా నిబంధనలను ఉల్లంఘిస్తూ పనులు కొనసాగించడంతో శనివారం పోలీసుల సహకారంతో మొత్తం తొమ్మిది అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎ. శ్రీధర్ మాట్లాడుతూ, భవన నిర్మాణదారులు తప్పనిసరిగా మంజూరైన అనుమతులకు అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్ట ప్రకారం మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సీజ్ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎ. శ్రీధర్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ బి. శ్రీదేవి, పోచారం ఐటీ కారిడార్ పోలీసు సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.





