ఘట్కేసర్, జూలై 19: రాష్ట్ర కవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి విమర్శించారు.
ఘట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర కవి అందెశ్రీ సేవలను స్మరించాల్సిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం బాధాకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై చేసిన వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాకు తగిన హుందాతనం, సంయమనం పాటించాలని సూచించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాల కల్పన వంటి హామీల అమలుపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగాయని పేర్కొన్న ఆయన, మేడ్చల్ నియోజకవర్గంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. అలాగే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య సమస్య, ఘట్కేసర్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం వంటి స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు.
రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారంపైనే ప్రభుత్వం దృష్టి సారించాలని రాగిడి లక్ష్మారెడ్డి కోరారు. సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.



