📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamమండలాన్ని ముంచెత్తుతున్న బెల్ట్ దందా .. అక్రమ మాఫియాల అడ్డాలుగా బెల్ట్ షాపులు.

మండలాన్ని ముంచెత్తుతున్న బెల్ట్ దందా .. అక్రమ మాఫియాల అడ్డాలుగా బెల్ట్ షాపులు.

📰 Generate e-Paper Clip

తిరుమలాయపాలెం,ప్రజావాణి:

తిరుమలాయపాలెం మండల వ్యాప్తంగా అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులు రోజురోజుకు పెరిగిపోతూ గ్రామాల ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగిస్తున్నాయి. జనవాస ప్రాంతాల్లోనే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు కొనసాగించడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక అనుమతులు లేకపోయినా కొందరు వ్యక్తులు బహిరంగంగానే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా కాకరవాయి గ్రామంలో బెల్ట్ షాపులు ఎక్కువగా నడుస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ బెల్ట్ షాపులు కేవలం మద్యం విక్రయ కేంద్రాలుగా మాత్రమే కాకుండా అక్రమ మాఫియాల అడ్డాలుగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడే వివాదాలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయని కూడా చెబుతున్నారు.కాకరవాయి గ్రామం నాలుగు జిల్లాల సరిహద్దులో ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తరచుగా గ్రామానికి చేరుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యక్తులు బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించి హంగామా సృష్టించడం వల్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించి కొందరు వ్యక్తులు గ్రామ వీధుల్లోనే గొడవలకు దిగడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని గ్రామస్తులు అంటున్నారు.ఇంత జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు విస్తరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని, ఎక్సైజ్ శాఖను డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular