*తిరుమలాయపాలెం,ప్రజావాణి.*
తిరుమలాయపాలెం మండలంలోని ఓ గ్రామంలో చేపట్టనున్న సుమారు ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం ముందే చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమం కోసం శంకుస్థాపన స్థలాన్ని పూలతో అందంగా అలంకరించిన అధికారులు, అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డుకు శాలువా కప్పడం ఆసక్తికరంగా మారింది.సాధారణంగా బోర్డును పూలతో అలంకరించడం లేదా తెరతో కప్పడం జరుగుతుండగా, ఇక్కడ మాత్రం శాలువా కప్పడం స్థానికంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అధికారులు వినూత్నంగా ఆలోచించారా లేక అత్యుత్సాహంతో ఇలా చేశారా అన్నదానిపై ప్రజల్లో చర్చ మొదలైంది.ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతుండగా, పనుల ప్రాముఖ్యత కంటే ఇలాంటి ఏర్పాట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి పనులు సమయానికి పూర్తి కావడంపైనే అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం శంకుస్థాపన బోర్డుకు శాలువా కప్పిన ఈ ‘వినూత్న’ ఏర్పాటే మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.



