📄 ePaper
5pm
7pm
Monday, November 30, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్తెలంగాణ పోరాటాల చరిత్రను తవ్వితే జనగామే కనిపిస్తుంది..! పల్లా రాజేశ్వర్ రెడ్డి

తెలంగాణ పోరాటాల చరిత్రను తవ్వితే జనగామే కనిపిస్తుంది..! పల్లా రాజేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 29 (ప్రజావాణి): తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలకు, త్యాగాలకు జనగామ గడ్డ కేంద్రబిందువుగా నిలిచిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ నాయకత్వం, ఆయన పోరాట పటిమ, రాజకీయ వ్యూహాలతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని యశ్వంత్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బతుకమ్మ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారులకు కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన గౌరవం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సాగునీటి సమస్యలు తదితర అంశాలపై ఘాటుగా స్పందించారు.

సిద్దిపేట ఏ విధంగా తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా నిలిచిందో, జనగామ ప్రాంతం కూడా అంతే స్థాయిలో పోరాట స్ఫూర్తిని చాటుకుందన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న, సమ్మక్క-సారక్క, రాణి రుద్రమదేవి వంటి పోరాట యోధుల స్ఫూర్తి ఈ గడ్డలో ఉందన్నారు. జనగామ ప్రజలు పైకి అమాయకంగా కనిపించినా పోరాటం విషయానికి వస్తే మాటకు మాట, పాటకు పాట, సై అంటే సై అనే తెగువ కలిగినవారన్నారు.

2004లో చేర్యాలలో తొలిసారిగా గులాబీ జెండా ఎగిరిందని, 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో ఎందరో అమరులు ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీలోనూ వివిధ పార్టీల నాయకులను కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించి, 38 పార్టీల మద్దతు పొందడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారన్నారు.

అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఎన్నడూ విస్మరించలేదని, ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి రాజకీయ పదవులు, ఉద్యోగాలు, భూములు, ఆర్థిక సహాయం అందించి సముచిత గౌరవం కల్పించామన్నారు. తెలంగాణ కోసం ఇకపై ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే సంకల్పంతోనే కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారన్నారు.

శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీయేనని, శ్రీకాంతాచారి కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సహాయం అందించామన్నారు. జనగామ జిల్లాలో ఉద్యమకారుడు పాగాల సంపత్ రెడ్డికి తొలి జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించామని, తొలి లైబ్రరీ చైర్మన్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి కూడా ఉద్యమకారుడేనన్నారు.

జనగామ జిల్లాలో ఇటీవల ముగ్గురు యువకులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. బచ్చన్నపేట మండలానికి చెందిన లక్ష్మణ్ గౌడ్, చిన్న వయసులోనే జడ్పీటీసీగా పనిచేసిన అజయ్, తాజాగా రవిచంద్ర మరణాలు తనను తీవ్రంగా కలచివేశాయన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు ముందుగానే తమ దృష్టికి వచ్చి ఉంటే పరిష్కరించేందుకు ప్రయత్నించేవాళ్లమన్నారు. ఈ ఘటనలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు.

దేవాదుల, సమ్మక్క సాగర్ నీళ్లను జనగామకు అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. దేవాదుల నీళ్ల కోసమే సమ్మక్క సాగర్ నిర్మాణం చేపట్టామని, రామప్ప నుంచి ఉనికిచర్ల వరకు సుమారు 48 కిలోమీటర్ల భారీ వాటర్ టన్నెల్ నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టిందన్నారు. కాల్వలు సిద్ధంగా ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడం లేదని, మోటార్లు ఆన్ చేయడం, తపాసుపల్లి, బస్వాపూర్ రిజర్వాయర్లను నింపడం వంటి పనులు చేపట్టడం లేదని విమర్శించారు. ఇంకా 20 శాతం మేర మిగిలిన పనులను పూర్తి చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు.

2023 తర్వాత రాష్ట్రంలో అబద్ధాల జాతర కొనసాగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిరోజూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. కార్యకర్తలు, నాయకులు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ వాదనలను, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వాస్తవాలతో సహా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.