జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 28 (ప్రజావాణి): జిల్లాలోని రఘునాథపల్లి మండలం, మండలగూడెం గ్రామంలో కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షులు బోనాసి క్రాంతి కుమార్ తల్లి బోనాసి లక్ష్మీ అనారోగ్యంతో మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, టీపీసీసీ సభ్యులు, వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ లు శనివారం మండలగూడెం గ్రామానికి చేరుకుని బోనాసి క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా బోనాసి లక్ష్మీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
లక్ష్మీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన డీసీసీ అధ్యక్షురాలు, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. బోనాసి క్రాంతి కుమార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

