📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్జనగామకు విచ్చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి పర్యటనతో ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారాలి.. ఎంఆర్పిఎస్

జనగామకు విచ్చేస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి పర్యటనతో ప్రభుత్వ ఆసుపత్రుల దశ మారాలి.. ఎంఆర్పిఎస్

📰 Generate e-Paper Clip

 

-రెఫర్లు లేని ఆసుపత్రిగా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దాలి

-జనగామ ఆసుపత్రికి ఎంఆర్ఐ, వెంటిలేటర్ ఏర్పాటు చేయాలి.

-మంత్రి పర్యటనతో ఆసుపత్రి దశ మారాలి

-100 పడకల నుండి 300 పడకల ఆసుపత్రిగా మార్చాలి.

-జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

-ప్రాణాలు పోతే బాధ్యులెవరు? ఎంఆర్పీఎస్ ప్రశ్న

-ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం కలిగించాలి

ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 27 (ప్రజావాణి): జనగామ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి జనగామకు విచ్చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన జనగామ ప్రభుత్వ ఆసుపత్రుల దశ మార్చే విధంగా ఉండాలని, రెఫర్లు లేని ఆసుపత్రిగా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ కోరారు.

జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమస్యల పరిష్కారం, పలు సదుపాయాల కల్పన కోసం జనగామ జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాల అత్యవసర సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ఎంఎస్పీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి సందేన రవీందర్ మాదిగ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ మాట్లాడుతూ, జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల గ్రామాలకు పెద్దాసుపత్రిగా పేరుగాంచిందని, అలాంటి ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు లేక సమస్యలతో నిండి ఉందన్నారు.

డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ స్పెషలిస్టులు ఉన్నా కూడా, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు ఆ చికిత్సకు సంబంధించిన వైద్య పరికరాలు లేవనే కారణంతో రెఫర్లు జరుగుతున్నాయన్నారు. ఇలా వైద్య సౌకర్యాలు లేవనే హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాలకు తరలిస్తుండగా మధ్యలో పోయే ప్రాణాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు.

జిల్లాలో ఎంఆర్ఐ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. క్రిటికల్ కేర్ సెంటర్ గా ఉన్నా కూడా వెంటిలేటర్ సౌకర్యం లేదని, ల్యాబ్ ఉన్నా కూడా పరీక్షల కోసం ఒక రోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని, అన్ని పరీక్షలు చేయడానికి అనువుగా ఉండే పూర్తిస్థాయి ల్యాబ్ ను ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజలు ఆర్థిక స్థోమత లేక తమ ఆరోగ్యాలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కని వచ్చే ప్రజలకు, వారు ఏ సమస్యతో వచ్చినా అన్ని రకాల చికిత్సలు జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చూడాలని కోరారు. ఆసుపత్రిలో డిజిటల్ ఎక్స్ రే, టూ డీ ఎకో, డెంగ్యూ, ప్లేట్ లెట్ మిషనరీలు ఏర్పాటు చేయాలన్నారు. రోగులకు కొన్ని మందులు కూడా అందుబాటులో లేని పరిస్థితి, స్నేక్ బైట్ కు విరుగుడు ఇంజక్షన్లు కూడా అందుబాటులో లేని కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు.

డాక్టర్లు, ప్రొఫెసర్లు, స్పెషలిస్టులు, వారి కింద జూనియర్ డాక్టర్లు ఇలా ఎంతో మంది ఉన్నా కూడా ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేకపోతుందని, ప్రైవేట్ ఆసుపత్రులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించే చోట ప్రభుత్వ ఆసుపత్రులు వెనుకబడిపోతున్నాయన్నారు. ఆ లోటును సవరించుకొని ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా టైమింగ్ ప్రకారం వారు నిరంతరం ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యసేవలు అందించాలన్నారు.

వైద్య కళాశాల ఏర్పాటు అయినా 100 పడకల ఆసుపత్రిగానే జిల్లా ఏరియా ఆసుపత్రి ఉన్న నేపథ్యంలో, దానిని 300 పడకల ఆసుపత్రిగా మార్చాలని, స్థల పరిశీలనలో ఉన్న నేపథ్యంలో తక్షణమే స్థల పరిశీలన పూర్తి చేసి అత్యాధునికమైన భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పక్కనున్న సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ విధంగా మెరుగైన సౌకర్యాలు ఉన్నాయో, అలానే జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మార్చాలని కోరారు.

చంపహిల్స్ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించాలని, అక్కడ అందుబాటులో లేని సౌకర్యాలను కూడా కల్పించాలని కోరారు. ఈ పర్యటన ద్వారా జిల్లా వైద్య అధికారులతో సమీక్ష చేసి, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కారమయ్యేలా కృషి చేయాలని, ప్రత్యేక సదుపాయాలు జనగామ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గువ్వల రవి మాదిగ, విహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి కుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల మహేష్ మాదిగ, విహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిర్రు నగేష్, విహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు గడ్డం సోమరాజు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కట్ట ప్రశాంత్ మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ అధికార ప్రతినిధి దైద సందీప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.