📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రతి అర్హులైన కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా

ప్రతి అర్హులైన కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా

📰 Generate e-Paper Clip

ప్రతి అర్హులైన కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుచూపుతో ప్రజలకు భరోసా.. త్వరలో వృద్ధులకు పెన్షన్లు

జూలపల్లి మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కృషి:

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 23:

రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుచూపుతో ప్రజల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు.

జూలపల్లి మండలం వాడ్కాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ బీమా పథకం ఆన్‌లైన్ విధానాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీమా పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు మెరుగైన భద్రత, సంక్షేమ సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించారని వివరించారు. కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గత పదేళ్ల పాలనలో అమలుకు నోచుకోని అనేక సంక్షేమ పథకాలను ప్రజాప్రభుత్వం ఆచరణలోకి తీసుకువస్తోందన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల విషయంలో గత ప్రభుత్వం ప్రజలకు తగిన న్యాయం చేయలేకపోయిందని విమర్శించారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, త్వరలోనే వయోవృద్ధులకు కూడా పెన్షన్లు అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జూలపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని విజయరమణారావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్ (ఎంఆర్ఓ), స్థానిక సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.