📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమహిళా సాధికారతకు ఉద్యోగ అవకాశాలే పునాది

మహిళా సాధికారతకు ఉద్యోగ అవకాశాలే పునాది

📰 Generate e-Paper Clip

మహిళా సాధికారతకు ఉద్యోగ అవకాశాలే పునాది

మహిళా జాబ్‌మేళాకు విశేష స్పందన.. 500 మందికి పైగా హాజరు

ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు సాధించిన పెద్దపల్లి మహిళలు

జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 23

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే కుటుంబంతో పాటు సమాజం కూడా సమగ్ర అభివృద్ధి సాధిస్తుందని జిల్లా బీసీ జేఏసీ చైర్‌పర్సన్ దాసరి ఉష అన్నారు. నేటి మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా అద్భుత విజయాలు సాధించగలరని పేర్కొన్నారు.

నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో దాసరి ఉష ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ సింధూర ఐటీఐ కళాశాల క్యాంపస్‌లో భారీ మహిళా జాబ్‌మేళా నిర్వహించారు. సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్, ఫిట్ అండ్ ఫ్యూచర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్‌మేళాకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ జాబ్‌మేళాకు సుమారు 500 మంది మహిళలు హాజరుకాగా, హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఉన్న ప్రముఖ ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ హైదరాబాద్ యూనిట్‌లో ప్రస్తుతం సుమారు 8 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 6 నుంచి 7 వేల మంది మహిళలే ఉన్నారని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 33 వేలకు పెంచే ప్రణాళిక ఉందని వివరించారు.

తెలుగు లేదా ఆంగ్ల భాష చదవడం వచ్చిన మహిళలు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. ఉద్యోగులకు భోజనం, బస్సు సౌకర్యంతో పాటు రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మహిళలకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన మహిళలు విధుల్లో చేరే మొదటి రోజు తాను కూడా వారితో కలిసి వస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగినులతో ప్రత్యేకంగా గెట్‌టుగెదర్ ఏర్పాటు చేసి వారి జీతభత్యాలు, వసతి, రవాణా తదితర సౌకర్యాలను స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. మహిళలు ఉద్యోగాల్లో చేరి స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

గతంలో డేటా సైన్స్ శిక్షణ ద్వారా పలువురు యువతీ యువకులు మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ పథకం కింద శ్రీమంత్ర సంస్థ ద్వారా నాలుగు నెలల పాటు నైపుణ్య శిక్షణ అందించి, అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల యువతీ యువకులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఉద్యోగాల్లో అనుభవం సంపాదించి భవిష్యత్తులో పెద్దపల్లిలోనే సొంతంగా పరిశ్రమలు, కంపెనీలు స్థాపించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని దాసరి ఉష పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫాక్స్‌కాన్ ప్రతినిధులు వీర్, మహేష్, సురక్ష మ్యాన్‌పవర్ సర్వీసెస్ ప్రతినిధులు దినేష్, కిరణ్, రజిత, మమత, రోహిత్, గాజుల రమేష్, రాహుల్, హనీ, అక్షయ్, ప్రదీప్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.