📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonపట్టభద్రుల కోసం పోరాడే నాయకుడు కావాలి.. ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం: డా॥ నలమాస శ్రీకాంత్...

పట్టభద్రుల కోసం పోరాడే నాయకుడు కావాలి.. ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం: డా॥ నలమాస శ్రీకాంత్ గౌడ్

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి): వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ అభ్యర్థిగా డా॥ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో, పార్టీ రూపొందించిన ‘పాంచజన్యం’ మేనిఫెస్టోను ఆయన వివరించారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, రైతులు, మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పలు హామీలను ప్రకటించారు.

జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు ఆనంతుల ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో డా॥ నలమాస శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందల మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అమరుల ఆశయాల స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్వర్ణ తెలంగాణ సాధించాలన్న ప్రజల ఆకాంక్ష పూర్తిస్థాయిలో నెరవేరలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నియామకాలు, ఉపాధి కల్పన, పేదలకు న్యాయం, పట్టభద్రుల సమస్యల పరిష్కారంలో ఆశించిన ఫలితాలు రాలేదని విమర్శించారు.

తాను బీసీ బిడ్డనని, పట్టభద్రుల కష్టాలు, నిరుద్యోగ యువత సమస్యలు తనకు తెలుసని అన్నారు. పట్టభద్రుల ఓట్లతో గెలిచిన కొందరు ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని, విద్య, వైద్య ఖర్చుల కోసం సామాన్య ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాడుతూ బాధితులకు అండగా నిలవడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. శాసనమండలిలో పట్టభద్రుల గొంతుకగా నిలబడతానని, ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యేలా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.

పాంచజన్యం మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు:

1. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఉచిత విద్యకు ప్రాధాన్యత కల్పించడం.
2. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగ నియామకాలు చేపట్టడం. యూత్ ఎంపవర్‌మెంట్ సొసైటీల ద్వారా ప్రతి గ్రామంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
3. పెన్షన్, కాంట్రాక్టు, డైలీ వేజ్, క్లీనింగ్ ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించడం.
4. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పించడం.
5. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు లక్ష రూపాయల న్యాయమైన హక్కును కల్పించడం.

ప్రభుత్వం నెరవేర్చాల్సిన ప్రధాన డిమాండ్లు:

– కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి.
– మెగా డీఎస్సీ ప్రకటించాలి.
– యూనివర్సిటీలకు నిధులు విడుదల చేయాలి.
– యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టాలి.
– విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలి.
– బెల్ట్ షాపుల కార్పొరేషన్ ఏర్పాటు హామీని నెరవేర్చాలి.
– ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
– ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.

తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే పాంచజన్యం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేస్తామని, అప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. పట్టభద్రులు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు ఆనంతుల ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇష్మాయిల్, ఎం. రాజిరెడ్డి, వీరనారి చాకలి ఐలమ్మ మనుమరాలు టీ. శోభ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరిపల్లి మాధవి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణవేణి, గాండ్ల వెంకన్న, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మంగ శంకర్, ఏడెల్లి సన్నీ, సుభాష్, పొన్నం యాకన్న గౌడ్, పాలకుర్తి ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.