రేడియల్ రోడ్డు పనులలో చెట్ల తొలగింపునకు అనుమతి తప్పనిసరి: ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ..
పరిగి, నవంబర్ 19,(ప్రజావాణి):
పరిగి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా, రేడియల్ రోడ్డు విస్తరణ సమయంలో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలంటే అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) ప్రతిమ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
పట్టా పంట పొలాల్లోనైనా, ప్రైవేట్ పరిసరాల్లోనైనా, మరే ఇతర ప్రాంతాల్లోనైనా అలాగే ప్రభుత్వ, అటవీ భూములలో ముందస్తు అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడం అటవీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని ఆమె హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా చెట్లను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా విధించడం జరుగుతుందని ఎఫ్‌ఆర్‌ఓ ప్రతిమ తెలియజేశారు. కాబట్టి సంబంధిత కాంట్రాక్టర్లు, ప్రజలు అటవీ శాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆమె సూచించారు.

