అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం!
అమ్మపేటలో 16 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
ముదిగొండ, నవంబర్ 18 (ప్రజావాణి ):
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అమ్మపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డెల్లి రామారావు అన్నారు.
ముదిగొండ మండల పరిధిలోని అమ్మపేట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో 16 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అర్హులైన వారికి నూతన పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధాప్యంలో ఉన్నవారికి, జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు అదొక భరోసా అని అన్నారు. ప్రతి నెలా అందే పింఛన్తో లబ్ధిదారులు తమ నిత్యావసరాలను తీర్చుకుంటూ గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు.
అమ్మపేట గ్రామంలో 16 మందికి నూతన పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
నూతనంగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, సహకరించిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ , వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పింఛన్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

