*భైంసాలో రేపు చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీల పంపిణీ*
*582 మంది అర్హులుగా గుర్తింపు.. 536 మందికి ప్రొసీడింగ్ కాపీలు మంజూరు.. లబ్ధిదారులు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలి: మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 17:-
భైంసా పట్టణంలోని చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల 18వ తేదీ బుధవారం రోజున ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేయనున్నట్లు మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు కుబీర్ బైపాస్ రోడ్డులోని చిన్న బ్రిడ్జి సమీపంలో ఉన్న బృందావన్ కళ్యాణ మండపంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భైంసా పట్టణ పరిధిలో చేయూత పెన్షన్ల కోసం మొత్తం 747 దరఖాస్తులు రాగా, అధికారుల పరిశీలన అనంతరం 582 మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 536 మందికి ప్రొసీడింగ్ కాపీలు మంజూరయ్యాయని, మరో 42 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరించి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులుగా గుర్తించిన 582 మందిలో 304 మంది సింగిల్ కేటగిరీ, 102 మంది ఒంటరి మహిళలు (సింగిల్ ఉమెన్), 176 మంది దివ్యాంగులు ఉన్నట్లు చైర్మన్ వివరించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వార్డుల వారీగా జాబితాలను సంబంధిత కౌన్సిలర్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా వార్డుల కౌన్సిలర్లు లబ్ధిదారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని సూచించారు.
*లబ్ధిదారులు తప్పనిసరిగా తీసుకురావాల్సిన పత్రాలు*
ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుతో పాటు సంబంధిత అర్హత ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని చైర్మన్ కోరారు. సదరం సర్టిఫికెట్ కలిగిన దివ్యాంగులు ఆ సర్టిఫికెట్‌తో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలి. ఒంటరి మహిళలు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్), ఆధార్ కార్డుతో స్వయంగా హాజరుకావాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందించడమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కాబట్టి సంబంధిత లబ్ధిదారులు తమకు అందిన సమాచారాన్ని గమనించి, నిర్ణీత సమయానికి అవసరమైన పత్రాలతో బృందావన్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు లింగురాం ప్రతినిధి, కౌన్సిలర్ సయ్యద్ అమీర్, అమూల్ తదితరులు పాల్గొన్నారు.

