*కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం*
*మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్*
*కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు, గృహ ప్రవేశాలు*
* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*
రాష్ట్రంలో కొలువైన రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలకు మేయర్ దర్ని మధుకర్ భూమి పూజలు, గృహ ప్రవేశాలు చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైన లబ్ధిదారులు పుదరి అనూష-సంపత్ ల నూతన గృహ నిర్మాణానికి ఆయన హాజరై, కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. 31వ డివిజన్లో లబ్ధిదారురాలు ముక్కెర మౌనిక నూతన గృహ నిర్మాణానికి మేయర్ దర్ని మధుకర్, కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి తో కలిసి హాజరై, భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ న్ కు చెందిన లబ్ధిదారులు కొండ సునీత-సత్యనారాయణ దంపతుల నూతన గృహ ప్రవేశానికి మేయర్ దంపతులు దర్ని మధుకర్-సుజాత లు హాజరై, రిబ్బన్ కట్ చేసి, గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో అర్హులకు ఇళ్లు మంజూరవుతున్నాయని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నాణ్యతతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.


