📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి

ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి

📰 Generate e-Paper Clip

ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి

సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ 15 నుంచి సమ్మెకు దిగుతాం

కలెక్టరేట్ ఎదుట నాలుగు గంటల పాటు ఆశా వర్కర్ల ధర్నా

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 16

పెద్దపల్లి: ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్ల సమస్యల సాధన కమిటీ (సీఐటీయూ, బీఆర్‌టీయూ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుమారు నాలుగు గంటల పాటు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా ఆశా యూనియన్ నాయకులు జి.జ్యోతి, ఏ.స్వరూప మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఆశా వర్కర్ల వేతనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమన్నారు.

గత 21 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో పాటు ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ వేతనం కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆశా వర్కర్ల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు శోభారాణి, టీ.శారద, అమృత, ప్రేమలత, మల్లీశ్వరి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.