చారిత్రక ఆనవాళ్లను కాపాడాలి.. నూతన కమాన్ నమూనాను వెల్లడించాలి!
ప్రజల మనోభావాలను గౌరవించకుండా పాత కమాన్‌ను తొలగించడం బాధాకరం
నూతన కమాన్ డిజైన్‌ను వెంటనే అధికారికంగా విడుదల చేయాలి
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 15:
పెద్దపల్లి పట్టణానికి దశాబ్దాలుగా చారిత్రక గుర్తింపుగా, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రధాన కమాన్‌ను తొలగించడం బాధాకరమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణ కన్వీనర్ కుక్క శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలోని ప్రధాన కమాన్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కుక్క శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పెద్దపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా నూతన కమాన్ నిర్మాణం చేపట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే పట్టణ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, స్థానికుల భావోద్వేగాలతో ముడిపడిన చారిత్రక గుర్తింపును కలిగిన పాత కమాన్‌ను తొలగించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పేరుతో పట్టణ చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఆనవాళ్లను కనుమరుగు చేయడం బాధాకరమన్నారు.
నూతనంగా నిర్మించనున్న కమాన్‌కు సంబంధించిన నమూనా చిత్రపటాన్ని (డిజైన్ బ్లూప్రింట్) వెంటనే అధికారికంగా విడుదల చేసి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పట్టణ చారిత్రక, సాంస్కృతిక వైభవం ప్రతిబింబించేలా ఆధునిక హంగులతో, ఆకర్షణీయమైన రూపంలో నూతన కమాన్‌ను నిర్మించాలని కోరారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అదేవిధంగా చారిత్రక కట్టడాల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, 1958 చట్టం ప్రకారం 100 మీటర్ల పరిధిలో నిర్మాణాల విషయంలో జిల్లా కలెక్టర్, పురపాలక సంఘం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కమాన్ పరిసర ప్రాంతంలో విశాలమైన సర్కిల్ ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని, స్థానిక అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.
పట్టణ అభివృద్ధితో పాటు చారిత్రక గుర్తింపును కాపాడటం కూడా పాలకులు, అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో కుక్క అశోక్, నూనె వెంకటేష్, ఎం.డి. మెహరాజ్, షఫీ, చరణ్, ప్రేమ్, శ్రావణ్, తిరుమల్, రమేష్, అభినవ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

