ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దీపావళి సంబరాలు
పేదల ఇంట్లో పండుగ వెలుగులు నింపిన ప్రజాప్రతినిధి, ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ
లబ్ధిదారుల కుటుంబంతో కలిసి క్రాకర్స్ కాల్చి, స్వీట్లు పంచుకుంటూ దీపావళి వేడుకలు
ఇందిరమ్మ ఇంట్లోనే సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08(ప్రజావాణి): పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం, వారి సంతోషాల్లోనూ భాగస్వామిగా నిలుస్తోందని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని పాలకుర్తి మండల కేంద్రంలోని ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే, వారితో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని ఆత్మీయతను చాటుకున్నారు.
పాలకుర్తి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కమ్మగాని స్వాతి – శోభన్ బాబు దంపతుల ఇంటికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా దీపావళి పండుగను పురస్కరించుకొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి, వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
అనంతరం కమ్మగాని స్వాతి – శోభన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే క్రాకర్స్ కాల్చి, స్వీట్లు పంచుకుంటూ దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ కార్యాలయాలు, నివాసాల్లో పండుగలు జరుపుకునే సంప్రదాయానికి భిన్నంగా, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబం మధ్యకు వెళ్లి వారితో కలిసి పండుగ జరుపుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. ఎమ్మెల్యే తమ ఇంటికి వచ్చి నూతన వస్త్రాలు అందజేసి, తమతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంతో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంకల్పమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లలో పండుగలు జరగాలి, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలి అన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
దీపావళి సంబరాల అనంతరం అదే ఇందిరమ్మ ఇంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
పేదల సంక్షేమం, మహిళా సాధికారత, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంట్లోనే జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.
ఒకవైపు దీపావళి పండుగ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, వారి కుటుంబంతో కలిసి పండుగ సంబరాలు జరుపుకోవడం, మరోవైపు అదే ఇంట్లో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను నిర్వహించడం ద్వారా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేద కుటుంబాల పట్ల తనకున్న ఆప్యాయతను, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు.
పేదల ఇంట్లో దీపావళి వెలుగులు, ఇందిరమ్మ లబ్ధిదారుల మధ్య ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు, ఇలా ప్రజల మధ్య, పేద కుటుంబాల సంతోషాల్లో భాగస్వామిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జరుపుకున్న ఈ వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

