*విశ్వశాంతిలో ముందస్తుగా దీపావళి పండుగ వేడుకలు*
*రాయికల్; నవంబర్ 07 (ప్రజావాణి):*
రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఎంతో ఆనందోత్సాహాలతో బాణసంచా పేల్చి కేరింతలు కొట్టారు. పాఠశాల ప్రాంగణం మొత్తం దీపకాంతులతో, పిల్లల నవ్వులతో కళకళలాడింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ మన దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే వెలుగుల పండుగ ‘దీపావళి’ అని అన్నారు. ‘దీపావళి’ అంటే ‘దీపాల వరుస’ అని అర్థమని వివరించారు.ఈ పండుగ వెనుక ఎన్నో పురాణ గాథలు ఉన్నాయని తెలిపారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం ముగించుకుని, 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు, ప్రజలందరూ దీపాలు వెలిగించి ఆనందంతో స్వాగతం పలికారని, అలాగే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకాసురుడనే రాక్షసుడిని సంహరించి ప్రజలకు పీడ వదిలించినందుకు గుర్తుగా కూడా ఈ పండుగను జరుపుకుంటారని వివరించారు.దీపావళి మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ఈ పండుగ ప్రతీక అని అన్నారు. ఈ రోజున మనమందరం ఇళ్లను శుభ్రం చేసుకుని, అందమైన రంగవల్లులు వేసి, ప్రమిదలతో అలంకరిస్తామని, కొత్త బట్టలు ధరించి, లక్ష్మీదేవికి పూజలు చేసి, పిండివంటలు, మిఠాయిలను బంధుమిత్రులతో పంచుకుంటామని తెలిపారు.అయితే ఈ దీపావళికి మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందామని, పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ కాలుద్దామని, శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తూ, జాగ్రత్తగా, సురక్షితంగా పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రమిదల్లో వెలిగే ప్రతి దీపం మీ జీవితాల్లో సరికొత్త ఆశలను, విజయాలను నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, అఫ్సర్, రజిత, సంజన, ఇందుజ, స్రవంతి, కవిత, సాయిహర్ష, శివాని, సౌజన్య, కళ్యాణి, మాలతి, అహల్య, గీత రాణి, ప్రవళిక, కావ్య, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

