తలారివానిపల్లి పరిసరాల్లో ఎలుగుబంటి సంచారం-అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు
సంచార ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన..
గ్రామస్తులు, రైతులు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక
బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.సిద్దిపేట జిల్లా రేంజ్ ఆఫీసర్ అరుణ, బీట్ ఆఫీసర్ రావాలి ఎలుగుబంటి సంచరించిన ప్రాంతాలను సందర్శించి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని, ఎలుగుబంటి కనిపించినట్లయితే దాని సమీపానికి వెళ్లకుండా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.గ్రామ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఈ పరిశీలనలో గ్రామ సర్పంచ్ గండికోట సురేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

