విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి.
-చెకుముకి సైన్స్ సంబరాల గోడపత్రిక ఆవిష్కరణ
రాయపోల్. నవంబర్ 3 (ప్రజావాణి)
విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించి, సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలన శక్తిని పెంపొందించేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు దోహదపడతాయని రాయపోల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చెకుముకి సైన్స్ సంబరాలు–2026 గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాల,మండల స్థాయి సైన్స్ సంబరాలను విజయవంతం చేసేందుకు అన్ని పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మ సత్యం మాట్లాడుతూ పాఠశాల స్థాయి పోటీలు నవంబర్ 12న, మండల స్థాయి పోటీలు నవంబర్ 21న, జిల్లా స్థాయి పోటీలు నవంబర్ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో మేడ్చల్‌లో జరుగుతాయని వివరించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, సైన్స్ ప్రయోగాలు, సైన్స్ ఎగ్జిబిషన్, విజువల్ రౌండ్, ఎక్స్‌పెరిమెంటల్ రౌండ్ తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఈ సంబరాలు వేదికగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల చెకుముకి కన్వీనర్ మెట్టు రాములు, నాగరాజు, శ్రీనివాస్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

