అంబేద్కర్ యువజన సంఘం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఘన ఆహ్వానం
నవంబర్ 14న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ వేడుకలు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 29(ప్రజావాణి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధన కోసం గత 50 సంవత్సరాలుగా అవిరామంగా కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నవంబర్ 14న హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ మహోత్సవాలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు, దళిత ఉద్యమ నేత జె.బి. రాజు నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్. అవిలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చెన్నేశ్వర్, సీనియర్ నాయకులు హరి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, సిల్వర్ జూబ్లీ ఆహ్వాన పత్రికను అందజేశారు.
1976వ సంవత్సరంలో అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం, అంబేద్కర్ ఆలోచనలను యువతలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థాపించబడిన అంబేద్కర్ యువజన సంఘం నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చరిత్రలో ఒక మైలురాయి అని వ్యవస్థాపకులు జె.బి. రాజు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వరకు దళితుల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం సంఘం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. 50 ఏళ్లుగా అంబేద్కర్ ఆశయాల కోసం, దళిత, బహుజన, గిరిజన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న అంబేద్కర్ యువజన సంఘం సేవలు అభినందనీయమని కొనియాడారు. నవంబర్ 14న జరిగే సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి తప్పకుండా హాజరై తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.
నవంబర్ 14న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది దళిత, బహుజన నాయకులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, యువత, మహిళలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరవుతారని రాష్ట్ర అధ్యక్షుడు అవిలయ్య, ప్రధాన కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ వేడుకల్లో 50 ఏళ్ల పోరాట ప్రస్థానంపై ప్రత్యేక సావనీర్ ఆవిష్కరణ, అంబేద్కర్ ఉద్యమకారుల సన్మానం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటన ఉంటుందని తెలిపారు.

