వైఎస్ఆర్ కడప జిల్లా అక్టోబర్ 29ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలో జనసేన పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది.పోరుమామిళ్ల-1 ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి శీలంశెట్టి లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణుల పూర్తి మద్దతుతో లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.ఈ విజయం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: శీలంశెట్టి లక్ష్మయ్య
తాను ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం శీలంశెట్టి లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తనపై నమ్మకముంచి, ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిపించిన పోరుమామిళ్ల-1 పరిధిలోని ప్రజలందరికీ ఆయన శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నాపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. నా సర్వశక్తులు ఒడ్డి, శ్రేయస్సుకు కట్టుబడి పార్టీ బలోపేతానికి పనిచేస్తాను. ఈ గెలుపు నాపై బాధ్యతను మరింత పెంచింది. ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత. నిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సుఖదుఃఖాల్లో భాగస్వామినవుతాను” అని లక్ష్మయ్య స్పష్టం చేశారు.ఇదే శుభసమయంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు (నాగబాబు) జన్మదినాన్ని పురస్కరించుకుని శీలంశెట్టి లక్ష్మయ్య ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పోరుమామిళ్లలో జనసేన సాధించిన ఈ ఏకగ్రీవ విజయం తాము ఆరాధించే నాయకుడు నాగబాబుకు అందిస్తున్న అపురూపమైన జన్మదిన కానుక అని లక్ష్మయ్య అభివర్ణించారు.నాగబాబు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన మార్గదర్శకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా శ్రేణులు ఆకాంక్షించాయి.
పండగ వాతావరణంలో జనసేన శ్రేణుల సంబరాలు:
పోరుమామిళ్ల-1లో జనసేన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే వార్త తెలియగానే మండలంలో పండగ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు, లక్ష్మయ్య అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ నాయకత్వం,నాగబాబు మార్గదర్శకత్వంలో కడప జిల్లాలో జనసేన జెండా రెపరెపలాడుతోందని, ఈ విజయం భవిష్యత్తులో పార్టీ సాధించబోయే మరిన్ని విజయాలకు నాంది అని స్థానిక నేతలు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల, జిల్లా స్థాయి జనసేన ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో జనసైనికులు, స్థానిక ప్రజలు పాల్గొని నూతన ఎంపీటీసీ శీలంశెట్టి లక్ష్మయ్యకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

