మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, అక్టోబర్ 28:
మాదకద్రవ్యాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార పోస్టర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించాలని సూచించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎర్రబాటి వెంకటేశ్వర్ రావు, వైస్ చైర్మన్ సాదుల వెంకటేశ్వర్లు, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు కావేటి రాజగోపాల్, జిల్లా కోశాధికారి పాంపాటి శ్రీకాంత్, నిమ్మనపల్లి సర్పంచ్ వేల్పుల రమేష్, పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీఎస్ మూర్తి, సంపత్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి.. యువతను కాపాడుకుందాం.. సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దుదాం అనే సందేశంతో నషా ముక్త్ భారత్ అభియాన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

