📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరం*

*సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరం*

📰 Generate e-Paper Clip

*విద్యార్థులకు పోక్సో చట్టం, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన*

*మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం*

మేడ్చల్: విద్యార్థుల్లో బాలల భద్రత, చట్టాలపై అవగాహన, ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ స్పృహను పెంపొందించేందుకు మేడ్చల్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టం సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు, ఆత్మప్రేరణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కుమారి వి. శ్రావణి యాదవ్, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యురాలు శ్రీమతి ఎం. ప్రసన్న విద్యార్థులకు పోక్సో చట్టంలోని ప్రాథమిక అంశాలను వివరించారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులను గుర్తించడం, వాటి నుంచి రక్షణ పొందడం, వేధింపులు ఎదురైనప్పుడు భయపడకుండా తక్షణమే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. బాధిత బాలలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయ సహాయ సేవల గురించి వివరించారు. అలాగే, ఆపదలో ఉన్న బాలలు సహాయం కోసం బాలల సంక్షేమ హెల్ప్‌లైన్ 1098ను, పోలీస్ సహాయం కోసం 100 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలియజేశారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మౌనంగా ఉండకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

*సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరం*

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను వినియోగించే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కార్యక్రమంలో సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను అపరిచితులతో పంచుకోకూడదని, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, లింకుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ వేధింపులు, బెదిరింపులు లేదా అనుమానాస్పద సందేశాలు ఎదురైతే వాటిని నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని, ఆత్మవిశ్వాసంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అలవర్చుకోవాలని ప్రతినిధులు ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు బాలల భద్రత, చట్టపరమైన హక్కులు, సురక్షితమైన సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.