📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణయాసంగిలో తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేయాలి

యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేయాలి

📰 Generate e-Paper Clip

యాసంగిలో తక్కువ నీటితో పండే పంటలనే సాగు చేయాలి….!

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

సోమవారం రఘునాథపాలెం మండలంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మండలంలోని మల్లేపల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం నల్లకుంట చెరువు నీటితో నిండిన సందర్భంగా చెరువు సందర్శించి చెరువులో పూలు వేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మల్లేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
గతంలో రఘునాథపాలెం ప్రాంతం ఖమ్మం అర్బన్ మండలంలో భాగంగా ఉండేదని, ఆ సమయంలో ఈ ప్రాంతానికి పంచాయతీ రాజ్ నిధులు అందుబాటులో ఉండేవి కావని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అప్పటి మంత్రి జానారెడ్డిని కోరడంతో రఘునాథపాలెం మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
కృష్ణా, గోదావరి నదులకు దూరంగా ఉన్న రఘునాథపాలెం మండలంలో గిరిజన జనాభా అధికంగా నివసిస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలను మెరుగు పరిచేందుకు వెంకటాయపాలెం డీప్ కట్ నుంచి మంచుకొండ లిఫ్ట్ ద్వారా 25 చెరువులకు నీటిని అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బుగ్గవాగు నుంచి మరో 11 చెరువులకు నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 46 మండలాల్లో రఘునాథపాలెం మండలానికి మాత్రమే సాగునీటి సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం మండలంలోని కొంత ప్రాంతానికి నీరు అందుతోందని వివరించారు. వచ్చే సీజన్ నుంచి బుగ్గవాగు నీటిని కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెరువుల్లో నీరు నిల్వ ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా రైతులు కూరగాయలు, తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే రఘునాథపాలెం మండలంలోని మొత్తం 36 గ్రామాల్లో ఓవర్‌హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు (ఓహెచ్‌ఎస్‌ఆర్‌) నిర్మించి త్రాగునీటి సరఫరా పథకాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే ప్రస్తుతం భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఆ పథకాలు సక్రమంగా పనిచేయడం లేదని అన్నారు. ప్రస్తుతం పుట్టకోట నుంచి ప్రత్యేక పథకం ద్వారా రఘునాథపాలెం మండలం మొత్తానికి త్రాగునీటినీ సరఫరా చేస్తున్నామని తెలిపారు. సూపర్ ఎల్‌నినో కారణంగా కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, మండల ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పుట్టకోట నీటి వనరులను నింపాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు.

త్రాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించు కోవాలని అన్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నందున అందుబాటులో ఉన్న నీటిని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, సహజ వనరులను వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
రఘునాథపాలెం మండలంలో మొదటి విడతలో 1,300 పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. రెండవ విడతలో మరో 1,100 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హత ఆధారంగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు రహదారుల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.75 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. త్వరలో మరో రూ.25 కోట్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో రైతుల పొలాలకు రహదారుల నిర్మాణానికి మొత్తం రూ.100 కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

వీబీ-జీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులను చేపట్టాలని సూచించారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో యాసంగి సీజన్‌లో వరి సాగుకు నీటి లభ్యత ఉండకపోవచ్చని మంత్రి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి, అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పంటలకు అవసరమైన నీటిని పొదుపుగా వినియోగించాలని అన్నారు. పశువులకు కూడా తగినంత నీరు అందేలా చూడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, నీటిని, విద్యుత్‌ను వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ప్రజాప్రతినిధులు రాయల నాగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, ఇరిగేషన్ డీఈ మోతీలాల్, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.