తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకే ముందస్తు అరెస్టులా?
ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్.. ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెజ్జంకి, అక్టోబర్ 26 (ప్రజావాణి):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్ల పాటు పోరాడి, లాఠీ దెబ్బలు తిని, జైళ్లకు వెళ్లిన ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అరెస్టులు తప్పడం లేదని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడటంపై వారు ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన బెజ్జంకి మండలానికి చెందిన ఉద్యమకారులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలితెలంగాణ ఉద్యమకారుల ఫోరం బెజ్జంకి మండల అధ్యక్షుడు మ్యాకల శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో త్యాగాలు చేశారని, వారి పోరాటాలు, బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని అన్నారు. అలాంటి ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ముందుకు వస్తే అరెస్టులు చేయడం కాకుండా, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు కల్పించాలి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో జాప్యం చేయడం సరికాదని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చింతకింది శ్రీనివాస్ గుప్తా, లింగాల లక్ష్మణ్, ముక్కిస తిరుపతి రెడ్డి, ఎల శేఖర్ బాబు, శానకొండ శరత్, జేరిపోతుల మధు, చెరుకూరి నరసయ్య, బొడిగె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

