యాతవాకిళ్ళ గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.
రూ. 9.40 కోట్లతో రెండు బీటీ రోడ్లకు నిధులు మంజూరు.
హుజూర్నగర్ అక్టోబర్ 25 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని యాతవాకిళ్ళ గ్రామం నుంచి అల్లిపురం వరకు, అలాగే యాతవాకిళ్ళ గ్రామం నుంచి చెన్నైపాలెం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి మొత్తం రూ. 9 కోట్ల 40 లక్షల నిధులు మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ యాతవాకిళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాతవాకిళ్ళ నుంచి అల్లిపురం వరకు సుమారు 4 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్ల 20 లక్షలు, యాతవాకిళ్ళ నుంచి చెన్నైపాలెం వరకు సుమారు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్ల 20 లక్షలు మంజూరు చేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రహదారుల నిర్మాణంతో ఆయా గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ ఇబ్బందులు తగ్గనున్నాయని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించి, ప్రజల అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుక్కల కరుణ నాగరాజు, మఠంపల్లి మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పులి శ్రీనివాసు, గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

