మరణానంతరం మరో జీవితానికి వెలుగులు.. ఓదెలలో 281వ నేత్రదానం!
నేత్రదాత పోలోజు నాగమణి కుటుంబ సభ్యులకు అభినందనలు
ఓదెల, అక్టోబర్ 17 ప్రజావాణి : ఓదెల మరణం తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే మానవతా విలువలకు ఓదెల గ్రామం నిలువుటద్దంగా నిలుస్తోంది. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంచుతూ కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఓదెల గ్రామానికి చెందిన పోలోజు నాగమణి నేత్రదానం చేశారు. దీంతో గ్రామంలో ఇప్పటివరకు 281వ నేత్రదానం పూర్తయింది.
ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి, ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ నేత్రదాత నాగమణి కుటుంబ సభ్యులను అభినందించారు. నేత్రదానం ద్వారా అంధత్వంతో బాధపడుతున్న వారికి చూపును అందించి, వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపవచ్చని వారు పేర్కొన్నారు. మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడేలా నేత్రాలను దానం చేయడం అత్యంత గొప్ప మానవతా కార్యమని తెలిపారు.
నాగమణి నేత్రదానానికి సహకరించిన ఆమె కుటుంబ సభ్యులు, అన్న పోలోజు రమేష్, వదిన పద్మ, అల్లుడు రాకేష్, మౌనికతో పాటు ముత్తూజు, భవాని, రమేష్, క్యాతం మల్లేశంలను ఈ సందర్భంగా ఆకుల మహేందర్ అభినందించారు. కుటుంబ సభ్యులు చూపిన సహకారం, సామాజిక బాధ్యత పట్ల వారు కనబరిచిన నిబద్ధత మరెందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఓదెల గ్రామంలో ఇప్పటివరకు 281 నేత్రదానాలు జరగడం గ్రామ ప్రజల్లో నెలకొన్న సేవాభావానికి, మానవతా దృక్పథానికి నిదర్శనమని మెరుగు భీష్మాచారి అన్నారు. నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించి, చూపు లేని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
మరణం తర్వాత కూడా మరొకరికి చూపునిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపే నేత్రదానం ఎంతో విలువైనదని, ఈ గొప్ప సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు.

