*డబిల్‌పూర్‌లో వైభవంగా దుర్గామాత నవరాత్రి పూజలు*
*చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన 23వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఆరిఫ్*
మేడ్చల్ ప్రజావాణి:- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని దబిల్‌పూర్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొన సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని 23వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఆరిఫ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీయాగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎండీ ఆరిఫ్ మాట్లాడుతూ.. దుర్గామాత అమ్మవారి కృపాకటాక్షాలతో దబిల్‌పూర్ గ్రామ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఐకమత్యంతో, సంతోషంగా జీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మధు, మాజీ యువజన నాయకుడు సల్ల వెంకటేష్ యాదవ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు దుడ్డు కుమార్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

