విద్యాసంస్థల్లో మతపరమైన వివక్షకు తావులేదు.. హిందూ ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు-ఏనుగు సుదర్శన్ రెడ్డి—
జవహర్ నగర్ అక్టోబర్ 14 (ప్రజావాణి ప్రతినిధి ):
భవానిమాత దీక్షలో ఉన్న విద్యార్థుల పట్ల అనుచిత వ్యాఖ్యలు అనురాగ్ యూనివర్సిటీ వైద్య కళాశాల యాజమాన్యంతో చర్చలు విద్యార్థులకు క్షమాపణలు–
ఘట్కేసర్ సర్కిల్ ఏదులాబాద్ డివిజన్ ఔషపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ నీలిమ వైద్య కళాశాలలో భవాని మాత మాలధారణ మరియు దీక్ష తీసుకున్న విద్యార్థుల పట్ల కొంతమంది లెక్చరర్లు,డీన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలను మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి’ తీవ్రంగా ఖండించారు.దీక్ష తీసుకుంటే ఎలా చదువుకుంటారని ప్రశ్నిస్తూ విద్యార్థుల మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయన కళాశాలకు వెళ్లి దీక్షలో ఉన్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం కళాశాల యాజమాన్యంతో చర్చించి, విద్యార్థుల మనోభావాలను గౌరవించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఇతర మతాల ఆచారాలు, సంప్రదాయాలను ఎలాగైతే గౌరవిస్తామో, హిందూ ధర్మాన్ని, హిందువుల విశ్వాసాలను కూడా అదే విధంగా గౌరవించాల్సిందేనని డిమాండ్ చేశారు.ఏ మతానికి చెందిన వారైనా ఇతరుల విశ్వాసాలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని అన్నారు. భవాని మాత దీక్ష తీసుకోవడం విద్యార్థుల వ్యక్తిగత విశ్వాసమని, దానిని ప్రశ్నిస్తూ అవమానించడం తగదని పేర్కొన్నారు.
హిందువులే హిందువులకు శత్రువులనే పరిస్థితి రావొద్దు:హిందూ ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఏనుగు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.ఇతర మతాలను గౌరవించాలని కోరుకునే వారు హిందూ ధర్మాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యతను గుర్తించాలని అన్నారు. విద్యాసంస్థల్లో మతపరమైన వివక్షకు తావులేకుండా అన్ని మతాల విద్యార్థుల విశ్వాసాలకు సమాన గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.
కళాశాల యాజమాన్యంతో చర్చల అనంతరం క్షమాపణలు తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి సూచించారు. విద్యాసంస్థలు విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో పరస్పర గౌరవం, మత సామరస్యం, సహనాన్ని పెంపొందించే కేంద్రాలుగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాగారం డివిజన్ అధ్యక్షులు నాగరాజు ఘట్కేసర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు అనిల్ గౌడ్, కాసుల వెంకటేష్ గౌడ్, భరత్ యాదవ్ ,సాయి గౌడ్, భవాని మాత భక్తులు, హిందూ బంధువులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

