📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజోగిపేటలో ఘనంగా ధమ్మ దీక్ష దివస్

జోగిపేటలో ఘనంగా ధమ్మ దీక్ష దివస్

📰 Generate e-Paper Clip

జోగిపేటలో ఘనంగా ధమ్మ దీక్ష దివస్

• అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సంఘాల నాయకులు
కులవివక్ష నిర్మూలనకు బౌద్ధ ధమ్మ మార్గం దోహదం
సమానత్వం, కరుణ, సామాజిక న్యాయమే ధమ్మ దీక్ష సందేశం

మన సమగ్ర ప్రజావాణి
అక్టోబర్ 14 జోగిపేట : జిల్లా ప్రతినిధి

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించిన అక్టోబర్ 14ను పురస్కరించుకుని ఆందోల్ మండలంలోని దళిత సంఘాల నాయకులు జోగిపేటలో ధమ్మ దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ధమ్మ దీక్ష అనేది కేవలం మత స్వీకరణ మాత్రమే కాదని, శతాబ్దాలుగా కొనసాగుతున్న కులవివక్షను ప్రశ్నిస్తూ ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం వైపు అడుగులు వేయడమని పేర్కొన్నారు. ప్రతి మనిషిని గౌరవించడం, అందరికీ సమాన హక్కులు కల్పించడం, కులవివక్ష లేని సమాజాన్ని నిర్మించడం అంబేద్కర్ చూపిన బౌద్ధ ధమ్మ మార్గంలోని ప్రధాన సందేశాలని తెలిపారు.
అంబేద్కర్ చూపిన బాటలో పయనించాలి
1956 అక్టోబర్ 14న నాగ్‌పూర్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ ధమ్మాన్ని స్వీకరించి చారిత్రాత్మక అడుగు వేశారని నాయకులు గుర్తుచేశారు. బౌద్ధ ధమ్మాన్ని ఆచరించడం ద్వారా ప్రజ్ఞ, కరుణ, సమానత్వం, నైతిక జీవనం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
అష్టాంగ మార్గంతో సమాజంలో మార్పు
ధమ్మ దీక్ష దివస్ సందర్భంగా ఆందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మ్యాతరి కరుణాకర్ మాట్లాడుతూ.. భగవాన్ గౌతమ బుద్ధుడు బోధించిన అహింస, సత్యం, దొంగతనానికి దూరంగా ఉండటం, అపరిగ్రహం వంటి నైతిక విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా వ్యక్తిగత జీవితంలో ఉన్నత విలువలను పెంపొందించుకోవడంతో పాటు సమాజంలో శాంతి, సామరస్యం, సమానత్వాన్ని నెలకొల్పవచ్చని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ కులవివక్షకు తావులేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.