📄 ePaper
Epaper 2
Thursday, October 29, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు….!

జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

గృహ నిర్మాణ శాఖ పనుల పురోగతిపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్‌ లతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షించారు.

జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన నివేదికలను నిర్దేశించిన నమూనాలో వాస్తవ సమాచారంతో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. వాస్తవ వివరాలు సమర్పించకుండా నిర్లక్ష్యం వహిస్తే సమీక్షలు కొనసాగించడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో పథకం అమలుకు ఎవరు బాధ్యత వహిస్తున్నారో స్పష్టంగా నిర్ధారించుకొని, ప్రతి అధికారి తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.
మండల స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఎంపీడీవోలు పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హౌసింగ్ ఏఈలు ఎంపీడీవోల సమన్వయంతో పనిచేయాలని, సర్వే వివరాల సేకరణ, నివేదికల సమర్పణ, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఎల్-1 జాబితాలోని దరఖాస్తులను గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతను నిర్ధారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎల్-2 జాబితాలోని దరఖాస్తుదారుల అర్హత, భూమి పత్రాల లభ్యతను పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు సమన్వయంతో పరిశీలించి, అర్హులైన వారిని నిబంధనల ప్రకారం ఎల్-1 జాబితాలోకి తీసుకురావాలని సూచించారు.
భూమి పత్రాలు లేవనే కారణంతో అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడం సరికాదని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి ప్రభుత్వ భూమా, ప్రభుత్వ అవసరాలకు కేటాయించిన భూమా, లేక అభ్యంతరాలు లేని ఇతర భూమా అనే అంశాలను సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని నిర్ధారించాలని తెలిపారు. స్థానిక సర్పంచ్‌లు, గ్రామ పెద్దలతో చర్చించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు అందుబాటులో లేకపోయినా, నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ బిల్లులు, ఇతర ఆధారాలను పరిశీలించి, మిగిలిన అర్హతలు సరిపోతే దరఖాస్తులను ఎల్-1 స్థాయికి పంపించాలని ఆదేశించారు. ఈ అంశాలపై శిక్షణ సమయంలోనే స్పష్టమైన సూచనలు జారీ చేశామని తెలిపారు.
ఎల్-3 జాబితాలో ఉన్న లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారిని ఎల్-1 జాబితాలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎల్-0, కొత్త దరఖాస్తుల వివరాలను నిర్దేశించిన నమూనాలో తయారు చేసి హౌసింగ్ పీడీకి పంపాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఇందుకోసం అన్ని మండలాలకు ఒకే విధమైన నమూనాను రూపొందించాలని సూచించారు.
గెజిటెడ్ అధికారుల పరిశీలన అనంతరం అర్హులైన ఎల్-1 దరఖాస్తులు కలెక్టర్ లాగిన్‌కు చేరుతాయని, అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి విచారణ వివరాలు, స్పష్టమైన సిఫార్సులు, సమర్థన నివేదికలను కలెక్టర్‌కు భౌతికంగా సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలో కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించి సిఫార్సులు పంపించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్లాబ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లకు చెల్లించే 25 శాతం మొత్తానికి సంబంధించి స్లాబ్ విస్తీర్ణ నిబంధనలను పాటించాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా స్లాబ్ వేయని ఇళ్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఈ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి మండలంలో ప్రత్యేకంగా మీడియా సమావేశాలు నిర్వహించాలని, స్లాబ్ నిబంధనలపై ప్రత్యేక పత్రికా ప్రకటన విడుదల చేయాలని ఆదేశించారు.

మొదటి విడతలో ఎల్-3 జాబితా నుంచి ఇళ్లు మంజూరై, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభించి, పనుల వివరాలు నమోదు చేసిన లబ్ధిదారులకు ఒకేసారి మినహాయింపుగా ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని తెలిపారు. అయితే పనులు ప్రారంభించని, నిర్మాణ వివరాలు నమోదు కాని ఇళ్లకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేశారు.

ఇలాంటి ఇళ్ల లబ్ధిదారులు ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించకుండా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా గుర్తించిన ఇళ్లకు సంబంధించి ఈ సమాచారం లబ్ధిదారులకు తప్పనిసరిగా చేరాలని సూచించారు. అర్హత పరిశీలన అనంతరం నిబంధనల ప్రకారం ఎల్-1 జాబితాలోకి మార్పు జరిగిన తరువాతే తదుపరి నిర్మాణ పనులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయిన తరువాత కూడా పనుల్లో పురోగతి లేకపోతే సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సంబంధిత హౌసింగ్ ఏఈలు, తహసీల్దార్లు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి రెండు పడక గదుల ఇళ్ల వాస్తవ పరిస్థితులను నమోదు చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రాధాన్యతను క్షేత్ర స్థాయి సిబ్బంది అర్థం చేసుకొని బాధ్యతా యుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఇందిరమ్మ ఇళ్ల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, తల్లాడ, రఘునాథ పాలెం, ఖమ్మం అర్బన్, మధిర తహసీల్దార్లు, ఈడీఎం దుర్గాప్రసాద్, ఇందిరమ్మ ఇళ్ల ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.