సింగరేణి OC-5 భూసేకరణలో పరిహారం నొక్కేసే యత్నం!
ధరణి ఆపరేటర్‌పై ముస్త్యాల రైతుల ఆరోపణలు.
భూమి లేకున్నా రికార్డుల్లో ఎకరాల కొద్దీ భూమి నమోదు.
సుమారు రూ.23.25 లక్షల పరిహారం కాజేసే ప్రయత్నం.
సింగరేణి RG-1 GMను ఆశ్రయించిన బాధిత రైతులు.
రామగిరి, సెప్టెంబర్ 06:
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో సింగరేణి OC-5 భూసేకరణ వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు చెందాల్సిన భూములు, పరిహారం ఇతరుల పేర్లపై నమోదు చేసి పరిహారం కాజేసే ప్రయత్నం జరుగుతోందని పలువురు బాధిత రైతులు ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ధరణి ఆపరేటర్‌పై ఆరోపణలు
రైతుల ఆరోపణల ప్రకారం.. గతంలో మంథని, అనంతరం రామగిరి మండలాల్లో ధరణి ఆపరేటర్‌గా పనిచేసిన అవునూరి రవి ప్రస్తుతం కమాన్‌పూర్ మండలంలో ధరణి ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ముస్త్యాల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 378లో రవికి ఎలాంటి భూమి లేకపోయినప్పటికీ, ఆయన పేరుపై రెండు ఎకరాలు, ఆయన భార్య పేరుపై 20 గుంటల భూమిని సర్వేలో నమోదు చేయించుకున్నారని రైతులు ఆరోపించారు.
అదేవిధంగా రెవెన్యూ అధికారుల సహకారంతో భూములు లేని మరికొందరి పేర్లపైనా భూములు నమోదు చేయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ విధంగా సుమారు 10 ఎకరాల వరకు భూమిని అక్రమంగా రికార్డుల్లో నమోదు చేసి, సింగరేణి సంస్థ నుంచి అందే పరిహారం పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.
రూ.23.25 లక్షల పరిహారంపై వివాదం
OC-5 భూసేకరణలో భాగంగా సింగరేణి సంస్థ నుంచి అందాల్సిన సుమారు రూ.23,25,000 పరిహారాన్ని అసలైన భూయజమానులకు కాకుండా అక్రమంగా పేర్లు నమోదు చేసుకున్న వ్యక్తులు పొందే అవకాశం ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి, వాస్తవ హక్కుదారులను గుర్తించి మాత్రమే పరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.
బహిరంగంగా రీ-సర్వే చేయాలని డిమాండ్
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో నిర్వహించిన సర్వేలపై, వాటికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా అక్రమంగా భూములు నమోదు చేయించుకున్న వ్యక్తులు, వారి వెనుక ఉన్న బినామీలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, సింగరేణి అధికారుల సమక్షంలో, పత్రికా ప్రతినిధులు, ప్రజల సమక్షంలో బహిరంగంగా రీ-సర్వే నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. అక్రమంగా భూములు నమోదు చేసుకున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని, అసలైన రైతులకు న్యాయం చేయాలని కోరారు.
RG-1 GMకు రైతుల మొర
ఈ నేపథ్యంలో బాధిత రైతులు మంగళవారం సింగరేణి RG-1 జనరల్ మేనేజర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. భూసేకరణ, సర్వే, పరిహారం చెల్లింపుల విషయంలో సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి న్యాయం చేస్తామని GM హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.
వాస్తవాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

