జర్నలిస్టుల వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను:
జవహర్ నగర్ నివాసి బండి నవీన్ ఆవేదన
జవహర్ నగర్: అక్టోబర్ 6 (ప్రజావాణి ప్రతినిధి):
గత 75 రోజులుగా ఇద్దరు రిపోర్టర్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలతో నన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర మానసిక శోభకు గురిచేస్తున్నారని జవహర్ నగర్ నివాసి బండి నవీన్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మీడియా వేదికగా ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.
ఈ సందర్భంగా బండి నవీన్ మాట్లాడుతూ… విలేకరి కరుణాకర్ గౌడ్, విలేకరి సురేందర్ లు కొంతకాలంగా తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన స్థలంలో 10 గజాల స్థలాన్ని రోడ్డుకు ఇవ్వాలని కరుణాకర్ నన్ను డిమాండ్ చేశాడని, లేదంటే ఆ స్థలాన్ని మొత్తంగా అమ్మేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడని తెలిపారు. దానికి తాను నిరాకరించడంతో, కక్షకట్టి తనపై కుట్రలకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ వద్ద ఉన్న అధికారంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, తాను సక్రమంగా నిర్మించుకున్న డబ్బాను (రేకుల షెడ్డు) తొలగించేలా చేసి, భయాందోళనలకు గురిచేశారని తెలిపారు. 2011లోనే ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని, ఈ లేఅవుట్ పరిధిలో దాదాపు 76 ప్లాట్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన 76 ప్లాట్లకు లేని అనుమతులు మరియు ఆంక్షల సమస్యలు, కేవలం తన ఒక్క ప్లాటుకే ఎందుకు తీసుకొస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మిగతా స్థలాలకు ఏ విధంగానైతే అనుమతులు ఇచ్చారో, అదే విధంగా తన ప్లాటుకు కూడా తక్షణమే అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరారు.
తమ కుటుంబానికి చెన్నాపురం జవహర్ నగర్ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. “చిన్ననాటి నుంచి చెన్నాపురంలో విద్యుత్ లేని రోజుల్లోనే మా బాల్యమంతా ఇక్కడే గడిచింది. మా నాన్నగారు చెన్నాపురం వాస్తవ్యుడిగా ఆ రోజుల్లో మోట బావుల ద్వారా వ్యవసాయం చేశారు. మేము ఇక్కడే పుట్టి పెరిగాము, మా పిల్లలు కూడా ఇక్కడే పెరుగుతున్నారు. మాకు వేరే ఊరు లేదు,” అని భావోద్వేగానికి లోనయ్యారు.
ఎలాంటి తప్పు చేయకపోయినా, జర్నలిస్టులు కరుణాకర్ గౌడ్, సురేందర్లు నిబంధనలకు విరుద్ధంగా తనపై దుష్ప్రచారం చేస్తూ కుటుంబ పరంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బతీస్తున్నారని వాపోయారు. ఇకనైనా తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను, అసత్య ఆరోపణలను తక్షణమే స్వస్తి పలకాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.



