ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత – మహాదేవుని శ్రీనివాస్
జనగామ జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 06(ప్రజావాణి): ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న “సేవ్ డెమోక్రసీ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడకూడదని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తోందని, ఓటర్ల జాబితాలో పారదర్శకత, ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడటం కోసం ప్రజల తరఫున ప్రశ్నిస్తోందని తెలిపారు.
“ఓటు మన హక్కు.. ఓటు మన భవిష్యత్తు.. అర్హులైన ప్రతి పౌరుడి ఓటును కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి పౌరుడు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
ఈ ధర్నా కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి గారు, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

