*జాపాల్–మంచాల రోడ్డు నిర్మాణం చేపట్టాలి*
*సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో*
మంచాల, అక్టోబర్ 1 (ప్రజావాణి): జాపాల్ నుంచి మంచాల వరకు నిలిచిపోయిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మంచాల గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మూడేళ్ల క్రితం రోడ్డు నిర్మాణానికి రూ.430 లక్షలు మంజూరైనట్లు శిలాఫలకం ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని సీపీఎం నాయకులు తెలిపారు.
రోడ్డుకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టి కంకర పోసిన అనంతరం పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని, వాహనాల టైర్లు దెబ్బతింటున్నాయని తెలిపారు.
ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జాపాల్–మంచాల రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించకపోతే ప్రజలను కలుపుకొని మరిన్ని ఆందోళనలు చేపడతామని సీపీఎం మంచాల గ్రామ శాఖ కార్యదర్శి దూసరి సత్తయ్య హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
