*పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు*
*పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి):
పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బూష పర్వతాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ఎల్. ధన్వంతి నాయక్, వైటీడీఏ సభ్యులు ఎల్. లక్ష్మీనారాయణ నాయక్ లతో కలిసి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై, తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మానికి చేర్చే బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ చార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మెటిక్ చార్జీలను గణనీయంగా పెంచామని, ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.
ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. జనగామ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఈ వేదికపైనే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.
అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడలతో ఉన్న ఇళ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను కూల్చకుండా పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు.
మూడో విడత, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి అర్హులైన పేదలకు పంపిణీ చేసి, తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ రుణాలు అందించామని చెప్పారు.
గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామని తెలిపారు.
జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని, ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58-60 కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తున్నామని, వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14-15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.
*భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి* మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఈ కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను అమలు చేశామన్నారు.
*ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి* మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో జనగామ మున్సిపాలిటీ అత్యంత పురాతన మున్సిపాలిటీ అని, మౌలిక వసతులను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఏడు నెలల క్రితం రూ.18.90 కోట్ల అభివృద్ధి పనులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని, వాటిని వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే వడ్లకొండ-షామీర్ పేట్ బైపాస్ రోడ్డును డబుల్ లైన్ చేయాలని, చిటకోడూరు బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని, గండిరామారం పంపులను మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.
అనంతరం 500 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపీరాం, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

