📄 ePaper
Epaper 2
Thursday, September 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్*గాలి ద్వారా వ్యాపించే వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించిన మెడిసిటీ గ్రూప్*

*గాలి ద్వారా వ్యాపించే వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించిన మెడిసిటీ గ్రూప్*

📰 Generate e-Paper Clip

*గాలి ద్వారా వ్యాపించే వ్యాధులపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించిన మెడిసిటీ గ్రూప్*

*ఆధునిక ఏఐ సాంకేతికతతో మహమ్మారులను ఎదుర్కొనే మార్గాలపై నిపుణుల చర్చ*

మేడ్చల్, నేడు న్యూస్:- గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు, వాటి వల్ల సంభవించే మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆధునిక వైద్య పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ఏఐ సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై మెడిసిటి గ్రూప్ ఆఫ్ కాలేజీల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నిరంతర వైద్య విద్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘన్‌పూర్‌లోని మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో బుధవారం నిర్వహించిన ఒకరోజు సదస్సుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరయ్యారు.కార్యక్రమాన్ని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు, లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డా. వి.ఎస్.వి. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, మెడిసిటి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈవో శ్రీ ఐనిష్ మర్చంట్, మెడిసిటి హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ డా. గీత, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ డైరెక్టర్ అకడమిక్స్ డా.మల్లికార్జున రెడ్డి, మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డా. దేవేంద్ర సింగ్ నేగి తదితరులు పాల్గొన్నారు. డా. మల్లికార్జున రెడ్డి అతిథులు, వైద్యులు, విద్యార్థులకు స్వాగతం పలికి సిఎంఈ కార్యక్రమం లక్ష్యాలు, ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ మాట్లాడుతూ వైద్య రంగంలో ప్రతిరోజూ కొత్త పరిశోధనలు, చికిత్సా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే వైద్యులు తమ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్య పూర్తిచేసి ప్రాక్టీస్‌లో ఉన్న వైద్యులకు కూడా నిరంతర వైద్య విద్యా కార్యక్రమాల ద్వారా తాజా పరిజ్ఞానాన్ని అందించడమే సిఎంఈ ల ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్య అతిథి డా. వి.ఎస్.వి. ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచం కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొందని గుర్తుచేశారు. అనంతర కాలంలో చిన్నారుల్లో శ్వాస సంబంధిత సమస్యలను ఎక్కువగా గమనిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లను ముందుగానే గుర్తించడం, వాటి వ్యాప్తిని నియంత్రించడం, బాధితులకు సమర్థవంతమైన చికిత్స అందించడం వంటి అంశాలపై మరింత అవగాహన అవసరమన్నారు. ఈ సిఎంఈ ద్వారా సంబంధిత అంశాలపై సమగ్ర చర్చ జరగడం ద్వారా వైద్యులకు ఉపయోగకరమైన పరిజ్ఞానం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రోజంతా జరిగిన సాంకేతిక సెషన్లలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డా. విజయకుమార్, అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన డా. విజయ్ వి. యెల్దండి సహా పలువురు వైద్య నిపుణులు వివిధ అంశాలపై ప్రసంగించారు. గాలి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్ల గుర్తింపు, నియంత్రణ, చికిత్సా విధానాలు, మహమ్మారి సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలపై వివరించారు. అనంతరం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మేడిసిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపల్ డా. శైలేంద్ర, అమెరికన్ కాన్సులేట్ ముంబయికి చెందిన పబ్లిక్ హెల్త్ నిపుణులు డా. రాజేష్ దేశ్‌ముఖ్ పాల్గొన్నారు. వైద్య రంగానికి పరిశ్రమలు, విద్యాసంస్థలను అనుసంధానం చేయడం, ప్రజారోగ్య రంగంలో సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు. భోజనానంతరం మహమ్మారి వంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది తక్షణమే ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై వైద్యులు, విద్యార్థులకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డా. రమేష్ రెడ్డి, ప్రొఫెసర్ యస్. హైమావతి, డా. మహమ్మద్ రఫీ, డా. సుధీర్ బుంగా, డా. విజయ్ కుమార్, శ్రీమతి చంద్రకళ తదితరులతో పాటు మెడిసిటి గ్రూప్‌కు చెందిన అధ్యాపకులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, విద్యార్థినులు, నర్సింగ్, పారామెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు. చివరగా డా. రమేష్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.