📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

📰 Generate e-Paper Clip

*ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? – వినయ్ భాస్కర్ పై పోలీసుల దౌర్జన్యంపై పల్లా ఆగ్రహం*

*ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటు – ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి దుస్థితిని ప్రశ్నిస్తూ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న దారుణ పరిస్థితులపై ప్రశ్నించడానికి వెళ్లిన ప్రజాప్రతినిధిని అడ్డుకుని దాడికి పాల్పడడం దారుణమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. ఎంజీఎంలో బెడ్లు, ఆంబులెన్స్‌ల కొరత, సిబ్బంది కొరత, పైకప్పులు పెచ్చులూడి పడుతున్న దుస్థితిపై ప్రశ్నించినందుకే కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.

ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకు కడుపులో తన్నడం, గాయపరచడం ఏ విధమైన ప్రజాస్వామ్య పాలన అని ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వం, ఆసుపత్రుల పరిస్థితులను చక్కదిద్దాల్సింది పోయి.. ప్రశ్నించే వారిపై పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటని విమర్శించారు.

పోలీసుల అత్యుత్సాహాన్ని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని, వినయ్ భాస్కర్‌పై జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని, ఆ గొంతును పోలీసు బలంతో అణచివేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.