జిల్లాలో మంచినీటి సమస్య తలెత్తకూడదు
వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలి
జిల్లాలో 100% అక్షరాస్యత సాధించాలి
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 21 మన ప్రజా వాణి
అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా మంచి నీటి సమస్య తలెత్తకూడదని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తాసిల్దార్ లు, ఎంపీడీవోలు ఏపీవోలతో మంచినీటి సమస్య, వ్యవసాయం, అక్షరాస్యత, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో జిల్లాలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య తలెత్తకూడదన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు మంచినీటి సమస్య ఉందని ఎక్కడైనా ఫిర్యాదులు వచ్చినట్లయితే 24 గంటల లోపల సమస్యను పరిష్కరించాలన్నారు. నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి సమస్యను సీరియస్ గా తీసుకొని పనిచేయాలన్నారు. ఎల్ నినో సమస్యను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు పంటలు సాగు చేసే విధంగా చూడాలని వ్యవసాయ శాఖ జెడిఎ కు సూచించారు. ఎల్ నినో సమస్యను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ తదితర లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రతి పౌరుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “ఉల్లాస్ – అక్షరాంధ్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు వయోజన విద్య అధికారులు సిబ్బంది వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి 100% అక్షరాస్యత శాతాన్ని సాధించాలన్నారు. కొంతమంది వాలంటరీలు గౌరవ వేతనం లేకుండానే నిరీక్షరాశులను అక్షరాసులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం
అభినందనీయమన్నారు.
ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కింద వేతనదారులు, డిఆర్డిఎ పరిధిలోని మహిళలు, మెప్మా పరిధిలోని పొదుపు సంఘాల నిరక్షరాశులను గుర్తించి విద్యావంతులుగా మార్చాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మలోల, డిఆర్డిఏ పిడి శైలజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాలు రెడ్డి, డ్వామా పిడి, ఏపీఎంఐపి పిడి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

