*తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ*
*సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన మేడ్చల్ బీజేపీ నాయకులు*
మేడ్చల్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఆవరణలో మేడ్చల్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు జెల్లీ శైలజా హరినాథ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన నాయకులు, ఉద్యమకారుల త్యాగాలను ఈ సందర్భంగా బీజేపీ నాయకులు స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ విమోచన దినోత్సవం చారిత్రక ప్రాధాన్యత కలిగిన రోజని, ఈ ప్రాంత ప్రజల పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలు దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీజేపీ నాయకులు వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా సాగింది.

