*ఇళ్లే లేని చోట ఇంటి నంబర్లు.. పన్ను రసీదులు*.!
–జిల్లెల్ల పంచాయతీ కార్యదర్శి ఆకరపు రవీందర్ సస్పెన్షన్
–సర్వే నంబర్ 450లో అవకతవకలు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చర్యలు.
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 17, ప్రజావాణి
ఇళ్లు లేని చోట ఇంటి నంబర్లు కేటాయించి, ఇంటి పన్ను రసీదులు జారీ చేసి, వాటిని ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించారనే ఆరోపణలపై జిల్లెల్ల గ్రామపంచాయతీ కార్యదర్శి ఆకరపు రవీందర్‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. సర్వే నంబర్ 450లో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ అనంతరం చర్యలు తీసుకున్నప్పటికీ, సస్పెన్షన్ విషయం తాజాగా వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
*అధికారుల ఉత్తర్వుల ప్రకారం* సర్వే నంబర్ 450లో ఎలాంటి భౌతిక నిర్మాణాలు లేకపోయినా 2024లో ఇంటి పన్ను రసీదులు జారీ చేసినట్లు విచారణలో గుర్తించారు. ముఖ్యంగా హెచ్.నంబర్లు 6-158/1, 6-158/2కు సంబంధించిన పన్ను రసీదులు 26-05-2024న జారీ అయినట్లు పేర్కొన్నారు.
అనంతరం ఈ రసీదులను ఆస్తుల అమ్మకపు దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.ఈ వ్యవహారంలో విధుల పట్ల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో జిల్లా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని, నిబంధనల ప్రకారం జీవన భృతికి అర్హత ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

