ఐదు గ్రామాల్లో ఉచిత మొబైల్ వైద్య సేవలు
– వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం వైద్య శిబిరాలు ఏర్పాటు
ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16
గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో వెల్‌స్పన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్ మెడికల్ వ్యాన్ సేవలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి గురువారం షాబాద్ మండలంలోని ఐదు గ్రామాల్లో మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందించనున్నారు.ఈ క్రమంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మాచనపల్లి గ్రామంలో వైద్య సేవలు ప్రారంభమవుతాయి. అనంతరం ఒక్కో గ్రామంలో గంట చొప్పున సేవలు అందిస్తూ నాగర్‌కుంట, షాబాద్, మిద్దెంగూడ, పోతుగల్ గ్రామాలకు మొబైల్ మెడికల్ వ్యాన్ చేరుకోనుంది.మొబైల్ మెడికల్ వ్యాన్‌లో ఒక వైద్యుడు, ఒక నర్సు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య సేవలు ప్రతి గురువారం పైన పేర్కొన్న ఐదు గ్రామాల్లో కొనసాగుతాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

