📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికపై వివాదం

కురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికపై వివాదం

📰 Generate e-Paper Clip

కురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికపై వివాదం

ఎన్నికను రద్దు చేసి రహస్య బ్యాలెట్‌తో తిరిగి నిర్వహించాలి.
అక్రమాలపై సమగ్ర విచారణకు సభ్యుల డిమాండ్.
మండల సమాఖ్య సభ్యులు.

డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్14,
ప్రజావాణి :

కురవి మండల సమాఖ్య అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని ఆరోపిస్తూ మండల సమాఖ్యకు చెందిన పలువురు సభ్యులు విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొరివి గ్రామ సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజు నాయక్ కు సంబంధిత ఉన్నత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఎన్నిక సందర్భంగా రహస్య బ్యాలెట్ విధానంలో ఓటింగ్ నిర్వహించాల్సి ఉండగా బహిరంగంగా ఓటింగ్ నిర్వహించారని సభ్యులు ఆరోపించారు. దీంతో సభ్యులు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. రహస్య బ్యాలెట్ నిర్వహించాలని పలుమార్లు కోరినా తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని తెలిపారు.

బలవంతంగా సంతకాలు?
ప్రస్తుతం ఎన్నికైన అధ్యక్షురాలికి మద్దతుగా పలువురు సభ్యుల నుంచి వారి స్వచ్ఛంద సమ్మతి లేకుండానే సంతకాలు తీసుకున్నట్లు సభ్యులు ఆరోపించారు. ఒత్తిడిలో సంతకాలు తీసుకున్నట్లు కొందరు సభ్యులు ఇప్పటికే అధికారులకు అభ్యంతరాలు తెలియజేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సభ్యులందరి వాంగ్మూలాలను నమోదు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.

13 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగింపు
కడారి స్వరూప సమ్మక్క సారక్క వీవోలో ఒకే వ్యక్తి సుమారు 13 సంవత్సరాలుగా నాయకత్వ పదవిలో కొనసాగుతున్నారని సభ్యులు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఒకే వ్యక్తి పదవిలో కొనసాగడం వల్ల ఇతర అర్హత కలిగిన మహిళలకు నాయకత్వ అవకాశాలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యాలకు అనుగుణంగా నాయకత్వ అవకాశాలను కల్పించాలని కోరారు.
అదేవిధంగా ఎన్నికైన అధ్యక్షురాలి అర్హత, పదవీకాలం, నివాస అర్హత తదితర అంశాలను ఎస్. ఇ. ఆర్. ఎ ఫ్ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

రహస్య బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నిక
ఎన్నికల ప్రక్రియపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ జరిపి అక్రమాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే ప్రస్తుత ఎన్నికను రద్దు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో రహస్య బ్యాలెట్ విధానంలో తిరిగి ఎన్నిక నిర్వహించి, ప్రతి సభ్యురాలు ఎలాంటి ఒత్తిడి లేకుండా తన ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంగెం హారిక, కొణతం సరస్వతి, మధ్యాహ్నపు రజిని, బుడమ సబిత, రాగిరి ఉమ, ఆమెడ లలిత, సిలివేర్ లక్ష్మి, లింగరబోయిన పార్వతి, మద్దోజ శ్రీదేవి, బత్తిని సుశీల తదితర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ రాజు నాయక్, వార్డు సభ్యులు నూతక్కి సాంబశివరావు, దళితరత్న దైవభద్రయ్య, ఆమెడ మల్లికార్జున్, రాగం వీరభద్రం,ఇరుగు వెంకన్న తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.